[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”]

ద్వితీయోऽధ్యాయః సాఙ్య్ఖయోగః
సంజయుడు పలికెను:- పనికిరాని దీనస్వభావమునూ, దుఃఖమునూ తెచ్చిపెట్టుకున్న మానవుని ఉద్దేశించి మాధవుడు ఇట్లు పెలికెను. (2.1)

మాధవుడు పలికెను:- కామములన్నీ ఒక్కసారిగ నీ మీద దాడిచేసి నిన్ను అధోగతిపాలు చేస్తున్న ఈ సంకటసమయంలో, నీచులకు తగినదియూ, ఉత్తమోత్తమమైన మోక్షగతికి ప్రతిబంధకమైనదియూ అయిన ఈ బుధ్ధిమాలిన్యం=ఈ కుత్సితబుధ్ధి=ఈ మోహం నీకెక్కడినుండి దాపురించింది,
అర్జునా! (2.2)

అర్జునా! నపుంసకుడవు అవవద్దు. కామాదులను ఎదిరించి నాశనంచేయలేని వారు నపుంసకులే. ఇది నీకు కూడనిది. నీచమైన ఈ అధైర్యమును విడిచి లే! (2.3)

అర్జునుడు పలికెను:- మాధవా! పూజార్హములైన లోకేషణ-విత్తేషణాది కామములను వద్దని తిరస్కారభావంతోనే ఉండకూడదే, అటువంటి కామములను ఎదిరించి ఎలాపోరాడటం? ఎలా నాశనం చెయ్యటం? (2.4)

గొప్పవైన లోకేషణాదిభావములను చంపక, వాటి బిక్షయైన కామాదులను అనుభవించటం ఈ లోకమున మేలు. లోకేషణాదిభావములను చంపితే, వాటిని చంపిన దుఃఖంతో (దుఃఖంలో ముంచిన) బ్రహ్మచర్యాది వ్రతములూ, కఠోరనియమములూ ఈ లోకంలో ఆచరించాలి. ఇది ఎంత కష్టం?
(2.5)

కామాదులను మనము జయిస్తామో, లేక మనలను కామాదులే జయిస్తవో, వీటిలో ఏది మనకు మేలో మనకు తెలియదు. ఏ కామాదులను చంపి మనం జీవించకోరమో అవే మన ఎదుట యుధ్ధానికి నిలిచి ఉన్నయ్. (2.6)

దీనదోషంచేత చితుకబడిన స్వభావం కలవాడనూ, ధర్మాధర్మ వివేకము నందు మూఢత్వమును చెందిన బుధ్ధికలవాడనూ అయిన నేను, నిన్ను వేడుకుంటున్నాను, మాధవా! నాకు ఏది శ్రేయస్కరమో నీవే నిశ్చయించి బోధ చేయుము. నేను నీకు శిష్యుడను, నిన్ను శరణుజొచ్చాను ,
నన్ను శాసించు. (2.7)

భూమియందు శత్రుశూన్యమైననూ, సమృధ్ధమైన రాజ్యమును పొందిననూ, దేవతల ఆధిపత్యమును పొందిననూ, నా ఇంద్రియములను దహించేస్తున్న ఈ శోకమును పరిహారము చేయగల మార్గమును తెలుసుకోలేకున్నాను. ((2.8)

సంజయుడు పలికెను:- ఈవిధంగ, తన దుఃఖమును గురించి మాధవునితో చెప్పి, నేను యుధ్ధం చేయను=నేను మోక్షసాధనను చెయ్యను, అని మౌనంగా ఊరకున్నాడు, అర్జునుడు. (2.9)

ధృతరాష్ట్రా! రెండుసేనల మధ్య విషాదంలో ముణిగి రధంలో=దేహాత్మభావంలో కూలబడిన అర్జుని చూచి, చులకన చేస్తూ, ఎగతాళిచేస్తూ, మాధవుడు ఈవిధంగ ఒక్కమాటను చెప్పాడు. నిజానికి, మాధవుడు చెప్పినది ఒక్కటేమాట, ఒక్కటే అయినదీ, సందేహంలేనిదీ, వైవిధ్యంలేనిదీ
అయిన ఒక్కతత్వమే. (2.10)

మాధవుడు పలికెను:- నీవు దుఃఖింపదగని వారిని గురించీ, దుఃఖింపదగని విషయములను గురించీ ఎడతెగకుండగ దుఃఖిస్తున్నావు. పైగా అన్నీ తెలిసిన జ్ఞానివలె మాట్లాడుతున్నావు. ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానులు=పండితులు గతించిన వారిని గురించిగానీ, బ్రతికి ఉన్నవారిని గురించిగానీ
ఇలా దుఃఖించరు. (2.11)

నేను ఇదివరకులేక ఇప్పుడు ఇలా దేహంతో ఉన్నాననటం, అంటే పుట్టాననటం తప్పు. అలాగే నీవూ, ఈ రాజులూ కూడా దేహంతో పుట్టినవారనటం కూడా తప్పే. అంతే కాదు. మనమందరమూ ఇక ఉండబోమనటం, అంటే నశించేవారనటం కూడా తప్పే. ఇది తత్త్వం, ఇది నిజం.
దేహాదిజగత్తునకు విలక్షణమైన తత్వమే నేను. వాస్తవంలో నీవు కూడా అంతే. నీవు గుర్తించవలసిన తత్వం ఇదే. వాస్తవంలో నీకూ నాకూ భేదం లేదు. అహం త్వమసి. తత్వమసి మహావాక్యార్థమును ఈ మాటలలోనే గమనించు! (2.12)

దేహాభిమానంగల దేహికి-జీవునికి, ఈ దేహంలో శైశవ-బాల్య-కౌమార-యౌవన-వార్థక్య అవస్థలు కలుగుతున్నట్లే, దేహం విడిచి-చచ్చి, పోవటం అనే మరణం ఒక అవస్థ. ఒక దేహంలోని ఒకానొకమరణావస్థను విడిచి ఇంకొక దేహంలోని శైశవావస్థకు పోతున్నాడు. అంతే! ధీరుడు
ఈ విషయంలో మోహంలో పడడు, దుఃఖించడు. (2.13)

కానీ, అర్జునా! ధీరుడు విచారించవలసిన విషయం ఇంకొకటి ఉన్నది. మోక్షసాధనకు వచ్చిన దేహేంద్రియాదులన్నీ పరమార్థమును విడిచి, తమకు కావలసిన అర్థములను కామములలోనే వెదుకుతున్నయ్. ఫలితంగా శీతోష్ణాది ద్వంద్వములు వస్తున్నయ్. అయినా, అవి కూడా
అశాశ్వతములూ అనిత్యములూ అని తెలుసుకొని, దేహాదిప్రవృత్తిని నిగ్రహించు! జీవభావాన్ని నిగ్రహించు!. (2.14)

ఈ ద్వంద్వములన్నీ దుఃఖములని గుర్తించి, చలించక, ఏ ధీరపురుషుడు వాటినుండి బుధ్ధిని మరల్చి, తద్వారా దేహేంద్రియాది ప్రవృత్తివలన బాధ పడక ఉంటాడో, అతడు మోక్షమును పొందుతాడు. (2.15)

కానీ, అసలు విషయం విను నాయనా!

జగత్తుకు భావం-ఉనికి లేదు, ఆత్మకు అభావం=లేకపోవటం అనేది లేదు. ఇది తత్వదృష్టి. సత్, అసత్, అనే రెండు భావముల గమ్యమైన సత్ భావమునే=ఆత్మభావమునే ప్రామాణంగా చూస్తున్నారు తత్వదర్శినులు. జగత్తుకు ఉనికి లేదు అను భావమూ, ఆత్మయే సత్యమను
భావమూ—ఈ రెండు భావములూ ప్రతిష్టములు కావాలి నీలో. వీటిలో ఏ ఒక్కభావం సడలినప్పటికీ సాధనసడలిందని గుర్తించు నాయనా! (2.16)

ఏ ఆత్మతత్వం సర్వవ్యాపియై ఉన్నదో, నాశనమయ్యే దేహాది జగత్తుకు విలక్షణమైన ఆ తత్వం నాశనం కానిది. మార్పులు కూడా చెందని ఆ తత్త్వమును ఎవరూ నాశనం చేయలేరు. (2.17)

నిత్యమైనదిగనూ, నాశనంలేనిదిగనూ, ప్రమాణాతీతమైనదిగనూ వాస్తవతత్త్వం చెప్పబడుతున్న ఈ శరీరంగల వానియొక్క శరీరమే నశిస్తున్నది. అంటే శరీరియొక్క శరీరమే నశిస్తున్నది, తన నిజస్వరూపమైన ఆత్మ నశించటం లేదు. కనుక, దుఃఖం విడిచి, నశించని ఆత్మస్వరూపాన్ని
తెలుసుకోటానికి యుధ్ధప్రయత్నంతో సాధన చెయ్యి, అర్జునా! (2.18)

ఎవడు ఈ ఆత్మను నాశనం చేసేదిగానూ, ఇంకా ఎవడు ఈ ఆత్మను నాశనం చేయబడేదిగానూ అనుకుంటున్నారో, వారిరువురూ తత్వం తెలియని వారే. ఈ ఆత్మ నాశనం చేయదు, నాశనం చేయబడదు. కనుక, ఒకరు ఇంకొకరిని చంపుతారనే బుధ్ధిని విడిచిపెట్టు. (2.19)

ఈ ఆత్మ ఒకప్పుడు పుట్టేదీ కాదు, ఒకప్పుడు నశించేదీ కాదు. అంటే, ఒకప్పుడులేక తరువాత ఉండటం (అంటే పుట్టటం)-ఒకప్పుడుండి తరువాత లేకపోవటం (అంటే నశించటం) అనే అవస్థలు లేవు. ఈ ఆత్మ పుట్టదు, నశించదు, మార్పులు చెందదు, ఎప్పుడూ కొత్తఅనుభవంగానే
నిత్యమై ఉంటుంది. శరీరం నాశనమైనా ఈఆత్మగానీ=ఆత్మానుభవంగానీ=ఆత్మానందంగానీ నశించదు. (2.20)

నాశనంలేనిదిగనూ, నిత్యమైనదిగనూ, జన్మలేనిదిగనూ, మార్పులు చెందనిదిగనూ ఈ ఆత్మను గుఱించి తెలిసిన వారెవరైనా దేనిని ఎలా చంపించుతాడు? దేనిని ఎలా చంపుతాడు? (2.21)

మరి, దేహం నశిస్తుంటే ఎలా దుఃఖించకుండా ఉండాలంటే, విను! చిరిగిన వస్త్రములను విడిచి మనుష్యుడు క్రొత్తవస్త్రములను ఎలా ధరిస్తున్నాడో, అలాగే జీర్ణమైన దేహమును విడిచి క్రొత్తదేహమును పొందుతాడు జీవుడు. అంతే! (2.22)

దేహంవలె, ఈ ఆత్మ, శస్త్రములచేత చేదింపబడదు, అగ్నిచేత దహింపబడదు, నీటిచేత తడుపబడదు, గాలిచేత ఎండింపబడదు. ఇంకా విను! (2.23)

దేహంలోని ఘనపదార్థం భూమి, ద్రవపదార్థం నీరు, వేడి అగ్ని, వాయువులు గాలి, చోటు ఆకాశం. ఈ ఆత్మ ఈ భూమిచేత చేదింపబడదు, నీటి చేత తడుపబడదు, అగ్నిచేత దహింపబడదు, గాలిచేత ఎండింపబడదు, ఆకాశము నుండి చోటుని ఆశించదు. అంటే,
పంచభూతాత్మకములైన దేహాదిపదార్థముల చేతనూ, బాహ్యపదార్థములచేతనూ ఈ ఆత్మ ఏవిధంగానూ బాధింపబడుటలేదు. వాటి మార్పులూ-బాధ ఈ ఆత్మకు లేవు. (2.24)

ఈ ఆత్మ నామరూపాత్మకములైన చరాచరజగత్తుచేత తెలియబడదు, ఇంద్రియాదులకు గోచరించదు, మనస్సుచేత ఊహింపబడలేదు. కనుక, ఇలా ఈ ఆత్మను తెలుసుకొని, నీవు దుఃఖించటానికి అర్హుడవు కావు. (2.25)
ఒకవేళ, తత్వం తెలియని నీదృష్టిననుసరించి, ఈ ఆత్మ ప్రతిదేహంతో పుట్టి, ప్రతిదేహం నశించేటప్పుడు నశించేదానినిగా నీవు అనుకున్నప్పటికీ, నీవు దుఃఖించనవసరం లేదు. (2.26)

ఎందుకంటె, పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మకూడా తప్పదు. కనుక, నీకు తెలిసినవిధంగా కూడా తప్పించుకోవటానికి వీలు లేని ఈ విషయంలో, నీవు దుఃఖించవలసిన అవసరంలేదు. (2.27)

భూతములూ, భూతభావములూ పుట్టాకపూర్వం వాటిఉనికి తెలియబడనిది. పుట్టిన మధ్యకాలంలో తెలియబడినవనుకున్నప్పటికీ, అవి దుఃఖస్వరూపములే. నాశనమైన తరువాతకూడా వాటి ఉనికి తెలియబడటం లేదు. ఇలా కాస్సేపు ఉన్నట్లుగా తోచి, ఉన్నకాలంలో దుఃఖాలపాలు చేసి, తరువాత తప్పించుకొని పోతున్నవే అయిన జీవభూతముల గురించి నీకెందుకు దుఃఖం అర్జునా? ఆత్మ తత్వమును విచారించు! (2.28)

ఈ ఆత్మతత్వమును ఒకడు గ్రాహ్యముగాని ఆశ్చర్యకరమైనదని అంటున్నాడు. ఇంకొకడు, తాను తికమకలోపడి ఇదికూడా తికమకయే అనంటున్నాడు. ఇంకొకడు, ఉన్నదున్నట్లు విశిష్టమైన తత్వంగానే వింటున్నాడు. విన్నప్పటికీ తెలుసుకోవటం లేదు, ఇంకొకడు. (2.29)

దేహంలో, దేహమును ధరిస్తున్నాననుకొనే ఈజీవుడు వాస్తవానికి ఎప్పుడూ చంపబడని (ఒక్కటే అయిన) ఆత్మస్వరూపుడే. కనుక నిత్యమైన ఆత్మతత్వమును కోరినవాడవైతే మిధ్యాస్వరూపములైన దేహములను గురించి నీవు దుఃఖించనవసరం లేదు. (2.30)

నీవు ఊహిస్తున్న దేహధర్మమే స్వధర్మముగ అనుకొని, ఆ దృష్టితో చూచినప్పటికీ, నేను చెప్తున్న మోక్షసాధనయుధ్ధమును ఆచరించక, నీవు దుఃఖించవలసిన అవసరంలేదు. ఎలాగో విను! (2.31)

దేహేంద్రియాదులు కామతృప్తిని పొందుటయే తెరువబడిన స్వర్గద్వారమనీ, అది సుఖమునుపొందు మానవులకే లబిస్తుందనీ నీ (దేహ) ధర్మభావం కదూ! అర్జునా! (2.32)

కామాదులను దేహేంద్రియాదులు తృప్తిగా సంపూర్ణంగా అనుభవించ లేవు. కామములను భోగిస్తుంటే అవి తృప్తి చెందవు సరికదా, ఆజ్యం వేసిన అగ్ని వలె ఇంకా పెరుగుతూనే ఉంటవి. అప్పుడు నీ దేహధర్మమునూ పోగొట్టుకుంటావు, ఇదివరకు కామములను భోగించిన తృప్తినీ=కీర్తినీ పోగుట్టుకుంటావు. అక్కడక్కడకూడా భ్రష్టుడవై నీ దృష్టిలోని పాపమునే పొందుతావు. ఈ అవాంతరమును తప్పించుకోవాలంటే కూడా మోక్షసాధనయుధ్ధమే నీకు శరణ్యం. (2.33)

ఇంకా విను! కామములను భోగించే ప్రజలందరూ కామాదులను తృప్తిపరచలేని నీ భ్రష్టత్వమును గురించి చాలా చెప్పుకుంటారు. ఒకప్పుడు లౌకికముగ గౌరవంతో బ్రతికిన నీకు (నిజగౌరవం ఆత్మానందం తోటిదేనని తెలియనందువలన) నీ దృష్టిలో మరణంకంటె ఈ భ్రష్టత్వం ఎక్కువ దుఃఖకరం. (2.34)

ఇంకా విను! కామాదులను అనుభవిస్తూ ఆనందిస్తున్నామనుకుంటున్న ప్రజలు, నీ భ్రష్టత్వమును చూచి, కామాదులద్వారా జీవితమును ఆనందమయం చేసుకోవటం చేతకాని అసమర్థుడవంటారు. కామాదులను అనుభవించుటకు ఇది వరకు నీతో తిరిగి నిన్ను వారిదృష్టిలో గొప్పగా తలచినవారు ఇప్పుడు నీచంగా చూస్తారు, నీచంగా మాట్లాడుతారు, ఇది నీకు నీ దృష్టిలో దుఃఖకారణమవుతుంది. (2.35)

ఇంకా విను! నీవంటె గిట్టనివారు, అదను చూచుకొని ఇలాగే అనరాని మాటలను కూడా చాలా కల్పించి అంటారు. నీ ప్రస్తుతపుదృష్టిలో దాని కంటె ఎక్కువ దుఃఖం ఏం ఉంటుంది? కనుక, కామాదులను సంహరించటం కష్టమని దుఃఖిస్తున్న నీవు, కామాదులను తృప్తిపరచుదామన్నా నీ దృష్టిలోనే ఈవిధంగా దుఃఖమే వస్తుందని గుర్తించు! (2.36)

నాయనా! కామాదులను తృప్తిపరచే నీ (దేహ) ధర్మయుధ్ధంలో=ప్రయత్నంలో చచ్చినా భోగములననుభవించే స్వర్గమునే పొందుతావు, లేక కామాదుల తృప్తికి ధ్యేయమైన భ్రష్టత్వమనే స్వర్గమునే పొందుతావు, దుఃఖాంతమును కాదు. నీ యుధ్ధంలో జయించినా, అంటే కామాదులను తృప్తిపరుస్తున్నాననుకున్నా కామాదులు తృప్తిచెందని అనిత్యమూ-అసుఖమూ అయిన ఇహలోకమునే పొందుతావు, దుఃఖాంతమును కాదు. కనుక, నీ దృష్టిలో కామాదులను తృప్తిపరచినా, లేకున్నా, నీకు దుఃఖమే వస్తున్నది, దుఃఖాంతం కావటం లేదు. కనుక, నీ దృష్టిని విడిచి, నేను చెప్పిన తత్వదృష్టిని అవలంబించి, శాశ్వతముగ దుఃఖమును అంతం చేసుకో నాయనా! మోక్షసాధనయుధ్ధమును కృతనిశ్చయంతో ఆచరించు! లే!! వేరేమార్గం లేదు. (2.37)

నీ దృష్టిలోని సుఖదుఃఖములూ, లాభాలాభములూ, జయాజయములూ, అన్నీ దుఃఖసమములను సమత్వదృష్టిని వహించి, ఆత్మతత్వావగాహనకై కామాదులను సంహరించుటకు, కామాదులను సంహరించే మోక్షసాధనయుధ్ధమునే ఆచరించు! ఇలా చేస్తే (నీవు ఊహించే) పాపమును పొందవు. (2.38)

అర్జునా! ఆత్మతత్వవిషయంలో జ్ఞానమూ, తత్వదృష్టీ చెప్పబడినవి. ఈ చెప్పిన విధంగా సాధనచేస్తున్నవాడవై కర్మబంధమును ఎలా త్రెంచుకుంటావో ఆ యోగమును=ఆ సాధనకర్మను విను! (2.39)

మానవుడు కర్మలు చేయటానికి దేహేంద్రియమనోబుధ్ధులు ఉపకరణములు. ఇవి కామాదులను కోరి, కామాదులయందు గుణప్రవృత్తితో చేసేకర్మలు గుణకర్మలనబడుతవి. గుణకర్మలవల్ల బంధం కలుగుతుంది, అనేకంగా సంసారంలో తిరుగాడుతారు. ఈ ఉపకరణములే ఆత్మతత్వమును కోరి కామాదులను సంహరించుటకు సాధనచేసినప్పుడు, ఈ సాధన సాధనకర్మ అని అనబడుతుంది. గుణకర్మల వలన కలిగే బంధమును త్రెంచుకోటానికి ఆచరించే ఈ సాధనకర్మయందు ఆరంభించిన సాధన నిష్ఫలమవటమూ, గుణకర్మలలోవలె ప్రతికూలమూ-పాపబంధములూ ఉండవు. ఈ సాధనకర్మను కొంచెమైనా చెప్పినవిధంగా ఆచరిస్తే, గొప్పసంసారభయమునుండి రక్షిస్తుంది. (2.40)

తత్వదృష్టితో సాధనకర్మను ఆచరించే బుధ్ధిమాత్రమే, ఒక్కటే అయిన ఆత్మతత్వమునందు లగ్నమై, సమాధానమవుతుంది. తత్వదృష్టిలేని కర్మలన్నీ గుణకర్మలే. ఈ గుణకర్మలలో బుధ్ధిప్రవృత్తి బహుశాఖలుగా అనంతములుగా ప్రవర్తిస్తుంటుంది. (2.41)

అర్జునా! వివేకహీనులకు, వేదములలో చెప్పబడిన తొలుచదువులలోని, కర్మలను గురించి (వాటి పూర్వాపరాలు తెలియక) వాదించటమే ధ్యేయం. జన్మఫలమగు కర్మలను, కర్మఫలమగు జన్మను కలిగించే స్వర్గాది భోగైశ్వర్యములందు ప్రేరేపించే గుణకర్మలే కర్మలని వాదిస్తారు వీరు. ఇలా జ్ఞానహీనులై వీరి పధ్ధతిలోనే కర్మలను చేస్తున్న కామబుధ్ధులకు ఆత్మతత్వవిషయమునందు చిత్తం సమాధానం కాదు. (2.42-44)

వేదములలోని కర్మలు, త్రిగుణవిషయములే అర్జునా! నీవు సాధనకర్మాచరణ ద్వారా త్రిగుణరహితుదవూ, ద్వంద్వరహితుడవూ, లౌకికయోగక్షేమములను చింతించని వాడవూ, ఆత్మస్వరూపుడవూ కావాలి. (2.45)

అంతటా నిండి నీరుంటే బావి మొదలైన క్షుద్రజలాశయములతో ఎలా ప్రయోజనంలేదో, అలాగే శాశ్వతసుఖస్థానమైన ఆత్మతత్వమును గురించీ, సాధనకర్మను గురించీ, తత్వదృష్టిని గురించీ తెలిసిన బ్రహ్మనిష్టునికీ, నిజసాధకునికీ, సర్వవేదములతో పనిలేదు. ఏది ప్రమాణమని ఇక వెదకకు. మోక్షసాధనకై సాధనకర్మను ఆచరించు! (2.46)

సాధనకర్మాచరణయందే నీకు అధికారం. గుణకర్మలకు ఫలమైన దుఃఖమునందూ ద్వంద్వములందూ నీకు అధికారం లేదు. గుణకర్మలను చేసి ఫలితంగా జన్మకు గుఱికావద్దు. అంతే కాదు. సాధనకర్మాచరణను తప్పించుకోవటానికి నీకు అధికారం లేదు. (2.47)

కర్మలకు బాహ్యరూపములను చూడకు. దేహేంద్రియాదులకర్మలే (చేయబడుతున్న) కర్మలు, కనుక, కామాదులయందు ఆసక్తిని సుతరాం విడిచి, లౌకిక ఫలాఫలములను దుఃఖసమములుగానే భావించి, యోగసాధనను=సాధనకర్మను దృష్టిలో ఉంచుకొని, సాధనకర్మాచరణకై దేహేంద్రియాదుల కర్మలను చెయ్యి, అర్జునా! (2.48)

తత్వదృష్టితో ఆచరించవలసిన సాధనకర్మకంటె మిగిలిన కర్మలన్నీ నీచమైనవి, అవి గుణకర్మలే. నీవు ఆత్మతత్వమునూ, తత్వదృష్టినీ, సాధనకర్మ లనే ఆశ్రయించు. గుణకర్మలను చేస్తూ ఫలితంగా దుఃఖమునూ, సంసారమునూ పొందేవారు నీచులు. (2.49)

సాధనకర్మను ఆచరించే సాధకుడు, సుకృతదుష్కృతములను రెండింటినీ సమత్వంచేత దుష్కర్మలుగానే గుర్తించి, కార్యకారణఫలములతో సహా వాటిని ఇక్కడే, ఈ సాధనలోనే విడిచేస్తాడు. నీ ధ్యేయంకూడా ఇదే కనుక, ఆత్మతత్వ అవగాహనకోసమే యుధ్ధప్రయత్నంతో సాధనకర్మను ఆచరించు! యోగమే=అంటే ఆత్మతత్వ అవగాహనయే=అంటే కామాదులనాశనమే, దేహేంద్రియాదుల కర్మలయందు నిపుణత్వం. (2.50)

ఆత్మజ్ఞానమూ-తత్వదృష్టియే (అధ్యాత్మ) బుధ్ధి. ఈ బుధ్ధియందు నియమింపబడి సాధనకర్మను ఆచరించేవాడు బుధ్ధియుక్తుడు. బుధ్ధియుక్తులు గుణకర్మలవలన కలిగే జన్మ=సంసారం అనే ఫలముని విడిచి, తద్వారా జన్మ బంధమునుండి ముక్తులై, బ్రహ్మపదమును పొందుతారు. (2.51)

నీ బుధ్ధిలోని మోహమనే కాలుష్యం ఎప్పుడు పోయిందనటానికి ఒకటే తార్కాణం. నీవు వినిన వాటిని గురించీ, వినబోవువాటిని గురించీ, ఇంద్రియముల సర్వవిషయములందూ , గుణకర్మలందూ నీకు రోతపుట్టాలి. నా ఈ మాటలకు విరుధ్ధంగా, కామాదులందు నిన్ను ఆకర్షించే ఇతరుల మాటలను వినుటవలనగానీ, వేదశాస్త్రములవలనగానీ చెదిరిపోయిన నీ బుధ్ధి ఎప్పుడు చలించక తత్వమునందు నిలుస్తుందో అప్పుడు యోగమును పొందుతావు. (2.52,53)

అర్జునుడు పలికెను:- మాధవా! సమాధియందు నిలిచిన స్థితప్రజ్ఞుని ప్రమాణం ఏది? ఏమి మాట్లాడుతాడు? ఎలా ఉంటాడు? ఏవిధంగా ప్రవర్తిస్తాడు? (2.54)

శ్రీభగవానువాచ:-

మాధవుడు పలికెను:- తనలో అవగాహన చేసుకున్న ఆత్మతత్వంచేత, తనలోనూ, సర్వత్ర ఏకమై వ్యాపించిఉన్న ఆత్మతత్వమునందే తృప్తిచెంది, అనాత్మపదార్థములయందు కోరికగానీ, దృష్టిగానీ లేనివాడై, తన మనస్సులో అనాదిగా నిలిచిఉన్న కామాదులనన్నిటినీ ఎప్పుడు పూర్తిగా విడుస్తాడో, సాధన కర్మను ఆచరించే ఈ బుధ్ధియుక్తుడు అప్పుడు స్థితప్రజ్ఞుడనబడుతాడు, అర్జునా ! (2.55)

లౌకికదుఃఖములందు క్షోభచెందక, లౌకికసుఖములంటే ఆకర్షణ లేక, జగద్విషయములందు ఆసక్తి లేక, అవి ఫలిస్తవో-లేవోనన్న భయం లేక, అవి ఫలించనందు వలన కోపం చెందక, విషయములందు ఈవిధంగా మౌననిష్ఠలో ఉండగలిగిన సాధకుడు స్థితప్రజ్ఞుడనబడుతాడు. సూక్ష్మములైన మనస్సులోని కామములను ఇలా బాహ్యరూపంగా గుర్తించి, నిగ్రహించు! (2.56)

ఎవడు సర్వత్ర ఆసక్తిలేనివాడో, సర్వత్ర సర్వవిషయములలో వచ్చే శుభాశుభములు పొందినప్పటికీ సంతోషింపడో, ఇవన్నీ వాస్తవదృష్టిలో ఉనికి లేనివి కనుక ద్వేషింపడో, అతని ఆత్మజ్ఞానం స్థిరమైనది. (2.57)

కామాదులు, ఇంద్రియములను, సూక్ష్మరూపంలో బాహ్యములైన కామ్య విషయములయందు ప్రేరేపణచేసి, బాహ్యస్థూలరూపములను పొందింపచేసి, ఫలితంగా ద్వంద్వములను అనుభవింపచేస్తవి. గుణప్రవృత్తిలో (అంటే, గుణ కర్మలలో) ఇలా ఇంద్రియాదుల సూక్ష్మస్థూలఫలరూప కర్మల యందు కామాదులే ఇంద్రియార్థములు. బయటనుండి అపాయం కలుగుతుందని భయపడినప్పుడు తాబేలు తన అవయవములను తన డిప్పలోకి ఎలా లాక్కుంటుందో, అలాగే, సాధకుడు, తన సాధనకు అడ్డువస్తున్న కామాదుల సూక్ష్మస్థూలఫలరూప కర్మస్థానములనుండి తన ఇంద్రియములను నిగ్రహిస్తాడు. ఈ సాధకుని ఆత్మజ్ఞానం స్థిరమైనది. (2.58)

అయితే, అణిమాదిసిధ్ధులకోసం ఇంద్రియనిగ్రహం చేసేవారికి విషయతృష్ణ చావదు. అత్మతత్వమును కోరి, తత్వదృష్టితో, సాధనకర్మాచరణ పూర్వకముగ ఇంద్రియనిగ్రహం చేసినవాని కామసంకల్పం కూడా నాశనమవుతుంది. (2.59)

అర్జునా! పరమార్థమును కోరియే, తత్వదృష్టితోనే ఎందుకు సాధనకర్మను ఆచరించాలో తెలుసా! అలా కాకపోతే, మోక్షసాధననే చేస్తున్నామనుకున్నప్పటికీ, వివేకమును పొందామనుకున్నప్పటికీ, అనేకజన్మలనుండి గుణకర్మలలో బలీయమైన ఇంద్రియాలు, సాధనలో ముందంజ వేస్తున్న మానవుని వివేకమును కూడా బలాత్కారముగ నాశనం చేస్తున్నవి. ఇది నిశ్చయం. (2.60)

కనుక, బలీయములైన ఇంద్రియములన్నిటినీ నిగ్రహించి, మాధవుడనైన (ప్రకృతికి నాధుడనూ, అధిపతినీ అయిన) నేనే పరమగతిగ సాధనచేయాలి. ఎవనియొక్క ఇంద్రియములు నిశ్చయముగ వానికి స్వాధీనములో, వాని ఆత్మజ్ఞానం స్థిరమైనది. (2.61)

అనాత్మవిషయములను ఊహించే మానవునికి వాటియందు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తివలన ఆశ=కోరిక పుటుంది. కోరిక ఫలించదు, ఫలించకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల అత్మానాత్మవివేకం నాశనమవుతుంది. వివేకనాశనంవల్ల గురు-శాశ్త్ర-పరమాత్మలనుండి గ్రహించిన బోధ స్మృతికికూడా రాకుండా పోతుంది. పర్యవసానంగా, పరమార్థజ్ఞానమునందూ, తత్వదృష్టియందూ, సాధనకర్మయందూ పూర్వమున్న జ్ఞానంకూడా నశించి మానవజన్మ మట్టిపాలవుతుంది. (2.62,63)

దేహం కూర్చోవటం, మొదలైనవీ-కర్మేంద్రియములైన వాక్కుకు మాట్లాడుట, చేతులకు ఇచ్చిపుచ్చుకొనుట, పాదములకు నడచుట, మొదలైనవీ-జ్ఞానేంద్రియములైన శ్రోత్రత్వక్ చక్షుర్ జిహ్వా ఘ్రాణములకు శబ్ద స్పర్శ రూప రస గంధములూ-మనస్సుకు విచారణ, బుధ్ధికి నిశ్చయం చేయటమూ-ఇవి ఆయా ఇంద్రియములకు సూక్ష్మరూపఇంద్రియకర్మలు, ఇవే ఇంద్రియముల కేవలకర్మలు, నిజస్వరూపములు, స్వస్వరూపములు, ఇంద్రియముల తేజస్సు.

ఈ ఇంద్రియములు కామప్రేరితములై గుణకర్మలను చేసేటప్పుడు సూక్ష్మస్థూలఫలరూపములలో కామ్యరూపములై తమ తేజస్సును పోగొట్టుకుంటున్నవి. ఆ దేహేంద్రియాదులే, ఆత్మతత్వమును కోరి సాధనకర్మను ఆచరించేటప్పుడు సూక్ష్మస్థూలఫలరూపములలో కూడా ఆత్మస్వరూపమునే పొందుతున్నయ్. కనుక, రాగద్వేషములను విడిచి ఇంద్రియములచేత సాధనకర్మను ఆచరిస్తున్న సాధకుడు ప్రశాంతతను పొందుతాడు. (2.64)

మనస్సు ప్రశాంతతను చెందితే సాధకుని సర్వదుఃఖములూ నాశనమవుతవి. దుఃఖనాశనం చేత, నిర్మలమైన మనస్సుగల సాధకుని జ్ఞానం, ఆత్మతత్వమునందు స్థిరమవుతుంది. (2.65)

ఇంద్రియములను నిగ్రహించలేనివానికి జ్ఞానం లేదు. జ్ఞానంలేని వానికి ఆత్మతత్వం స్థిరం కాదు. ఆత్మతత్వం స్థిరం కాకపోతే ప్రశాంతత లేదు. ప్రశాంతతలేక సుఖం ఎక్కడిది? లేదు. (2.66)

ఎందుకంటే, నీటిపై తేలుతున్న పడవ పెనుగాలిచేత ముణిగిపోయినట్లే, ఇంద్రియముల గుణప్రవృత్తిలో చరించే మనసు, ఏ ఇంద్రియాన్ని అనుసరిస్తే ఆ ఇంద్రియప్రాభవం అతని సాధనను నాశనం చేస్తుంది. (2.67)

కనుక, ఎవని ఇంద్రియాలు సూక్ష్మస్థూలఫలరూపకర్మలలో ఉన్న అన్ని ఇంద్రియార్థముల గుణప్రవృత్తినుండి నిగ్రహింపబడుతవో అతని ఆత్మజ్ఞానం స్థిరమైనది, అర్జునా! (2.68)

సర్వభూతములకూ ఏ ఆత్మతత్వం చీకటివలె తోస్తుందో, ఇంద్రియనిగ్రహంగలవాడు దానియందు ఆనందమును అనుభవిస్తాడు. ఏ అనాత్మపదార్థములందు భూతములన్నీ మెలకువతోనూ, ఉత్సాహంతోనూ ఉంటవో ఆ సంసారం, ఆత్మతత్వానుసంధానం చేసే మునికి తమస్సుగా కనిపిస్తుంది. సంసారితో పోల్చి సాధకుని సాధనపధ్ధతిని చెప్తున్నాను గుర్తించు, అర్జునా! (2.69)

అప్పటికే పూర్తిగా నీటితో నిండి ఉన్న సముద్రంలో అనేకనదులనీరు విరామంలేకుండా ప్రవేశిస్తున్నప్పటికీ ఆ సముద్రం ఎలా చలించక, గట్టుదాటక ఉంటున్నదో, అలాగే ఏ సాధకుడు అన్ని కామములు తనకై నిలిచి ఉన్నా చలించక వాటిని విలీనం చేయగలుగుతాడో ఆ సాధకుడు ఆత్మతత్వానురూపశాంతిని పొందుతాడు. కామములను ఏ కించిత్ కోరేవారైనా వారికీ శాంతి ఎప్పటికీ లభించదు. (2.70)

అన్ని కామములను విడిచి, కామముల స్పృహకూడా లేక, మమత్వహంకారములు లేక ఏ సాధకుడు సంచరిస్తాడో అతడు పరమశాంతిని పొందుతాడు. (2.71)

ఇదే బ్రహ్మీస్థితి=బ్రహ్మతత్వమునందు నిలిచే స్థితి, అర్జునా! ఈ స్థితిని పొందిన సాధకుడు ఇక మోహమును పొందడు. అంతే కాదు, దేహావసానకాలమందు కూడా ఈ స్థితియందు నిలిచి మోక్షమును పొందుతాడు. (2.72)

ఓం తత్ సత్
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉననిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే సాఙ్య్ఖయోగోనామ ద్వితీయోధ్యాయః

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]

Close Menu